May 18, 2024

People News Channel

Best News Web Channel

ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. భయకంపితులైన రోగులు.. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

(విశాఖపట్నం  – పీపుల్ న్యూస్):  విశాఖ నగర నడిబొడ్డున గల జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. రెండవ అంతస్తులు గల ఆపరేషన్ థియేటర్లో మొదటగా పేలుడు సంభవించింది. దీంతో దట్టమైన మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో ఆసుపత్రిలో ఉన్న వందలాది మంది రోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో గుండెను గుప్పిట్లో పెట్టుకొని ఆహాకారాలు చేశారు. మంటలు తో పాటు దట్టమైన పొగ ఆసుపత్రిలోని అన్ని అంతస్తులకు వ్యాపించడంతో రోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఐసీయూ లో ఉన్న రోగులు ఊపిరాడికా అల్లలాడిపోయారు. విపరీతమైన పొగ వలన ఒకరికి ఒకరు కనిపించే పరిస్థితి లేకుండా పోయింది.

                                                                                                         

రోగులు బంధువులు వారి కుటుంబీకులకు ఏమైపోయిందో నన్న భయంతో పెద్దపెద్ద అరుపులు కేకలు పెట్టడంతో ఆసుపత్రి ఆవరణ అంతా భయానికి వాతావరణం నెలకొంది. సంఘటన గురించి తెలిసిన వెంటనే అగ్ని మాపక శాఖ అధికారులు, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సకాలంలో ఈ రెండు శాఖలు స్పందించి ఆసుపత్రిలో మంటల్ని అదుపు చేయడానికి కావలసిన సత్వర చర్యలు చేపట్టాయి. ఆసుపత్రిలో గల అన్ని అంతస్తులలో ఉన్న రోగులను హుటాహుటిన బయటకు తీసుకువచ్చి కొందర్ని కేజీహెచ్ కు, మరికొందరిని విజేత , మెడికవర్ ఆసుపత్రులకు వేరు వేరు వాహనాలు ద్వారా అంబులెన్స్ ద్వారా తరలించారు. అనంతరం 2 వ అంతస్తులో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు కావలసిన చర్యలను చేపట్టారు. అలాగే మిగతా అంతస్తులులలో దట్టమైన పొగ వ్యాపించిన నేపథ్యంలో రోగులను , వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటికి తీసుకురావడంలో పోలీసు యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ సంఘటన స్థలికి హుటాహుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలను తానే స్వయంగా పర్యవేక్షించారు. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్రమైన విచారణ చేపడతామని, ఇండస్ ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ ఎంత మేరకు తీసుకున్నారు అన్నది పరిశీలిస్తున్నామని సిపి తెలిపారు. సుమారు రెండున్నర గంటల పాటు ఇండస్ ఆసుపత్రి వద్ద భయానక వాతావరణం నెలకొంది. రోగులను  రక్షించడం, సురక్షిత ప్రదేశాలకు తరలించడం, రోగుల బంధువులకు ధైర్యం చెప్పడం, మంటల్ని అదుపు చేయడం లో అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసు యంత్రాంగం పనితీరు ప్రశంసనీయమని చేపుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇండస్ ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాలపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు సంఘటన స్థలాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించి రోగులకు సంఘీభావం తెలిపారు