May 18, 2024

People News Channel

Best News Web Channel

24 గంటలూ అందుబాటులో ఉంటా – విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ

(విశాఖపట్నం – పీపుల్ న్యూస్):   ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తానని విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ అన్నారు.సోమవారం ఉదయం ఆయన విశాఖ రేంజ్ డీఐజీగా  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖ లోని అన్ని విభాగాలను పట్టిష్ట పరిచేందుకు కృషి చేస్తానన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే  లక్ష్యం అన్నారు. పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయటమే తన ప్రథమ కర్తవ్యం అని తెలిపారు. అదే విధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గంజాయిని నిర్మూలించేందుకు  ప్రత్యేకంగా దృష్టి పెడతానన్నారు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తూ ముందుకు వెళతానని అన్నారు. వార్తలు ప్రచురించే ముందు తనను లేదా తమ ఎస్పీ స్థాయి అధికారులను సంప్రదించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు. సోషల్ మీడియాలో పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వార్తలు ప్రచురించడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని కావున వార్త ప్రచురించే ముందు దానిని నిజనిర్ధారణ చేసుకోవాలని తద్వారా పత్రికలు విలువలు కూడా పెరుగుతాయని ఆయన మీడియాను కోరారు.విజయవాడ లా అండ్ ఆర్డర్  డీసీపీ గా పనిచేస్తూ పదోన్నతి పై విశాఖ రేంజ్ డిఐజీగా వచ్చిన విశాల్ గున్నీ.  2010 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. విశాఖపట్నం రేంజ్ ఐజీ గా విధులు నిర్వహిస్తున్న ఎస్.హరికృష్ణ  ఐపీఎస్ ని డీజీపీ కార్యాలయంలో ఐజీ పర్సనల్  గా బదిలీ చేశారు. విశాల్ గున్ని 2013 నుండి 2015 వరకు నర్సీపట్నం సబ్ డివిజన్ ఏఎస్పీ గా ,పదోన్నతి పై ఓ.ఎస్.డి గా విశాఖపట్నం రూరల్ జిల్లాలో పనిచేసిన అనుభవం,విశాఖపట్నం రేంజ్ పై అవగాహన ఉందని తెలిపారు. .బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఐజీ ని రేంజ్ పరిధిలోని 5 జిల్లాల ఎస్పీలు, పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.