May 18, 2024

People News Channel

Best News Web Channel

ప్రతిపక్షాలపై కక్ష సాధింపే జగన్ ఎజెండా – గంటా శ్రీనివాసరావు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాలన ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికే కేటాయించారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఏదైనా మంచి పనితో పాలన మొదలుపెడతారనుకుంటే, ప్రజా విజ్ఞప్తులు తీసుకునే ప్రజా వేదికను కూల్చేసి విధ్వంసంతో ప్రారంభించారని విమర్శించారు. ఆనందపురం మండలం గంభీరం, ముకుందపురం, బోని, సిర్లపాలెం, పేకేరు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీలైతే ప్రతిపక్షాలపై దాడులు చేయడం, లేదంటే తన మీద తాను దాడులు చేయించుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిందని చెప్పారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన 73 ఏళ్ల చంద్రబాబును ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచడం జగన్ నైజాన్ని తెలియజేస్తోందని అన్నారు. సొంత చెల్లే జగన్ మానసిక ఆరోగ్యం గురించి అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

మద్య నిషేధంపై నాలిక మడతేసిన సీఎం ;

అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్య నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓటు అడగబోనని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మద్య నిషేధం పేరు చెప్పడంతో అక్క చెల్లెమ్మలు 2019లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. నిషేధం మాటలా ఉంచి మద్యం ధరలు మూడు రెట్లు పెంచేశారని, ఆరోగ్యంతో పాటు జేబులు కూడా గుల్ల చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్య నిషేధం మాట ఎత్తనివ్వకుండా 25 ఏళ్ల పాటు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకు వచ్చారని తెలిపారు.2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2028, 2029 లలో రూ.500 చొప్పున పెన్షన్ పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు రూ.200 పెన్షన్ ను ఒకేసారి రూ.2 వేలకు పెంచగా, పెన్షన్ ను రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చి అయిదేళ్ల తర్వాతే ఆ మొత్తం పెంచారని విమర్శించారు. కార్యక్రమంలో టిడిపి భీమిలి ఇంచార్జీ కోరాడ రాజబాబు, బీజేపీ ఇంచార్జీ రామునాయుడు, జనసేన నాయకుడు ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.