May 18, 2024

People News Channel

Best News Web Channel

భీమిలి సమగ్ర అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో – అసెంబ్లీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం): భీమిలి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక లోకల్ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్టు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. పీపుల్ న్యూస్ ఛానెల్ తో ఆయన  మాట్లాడుతూ విశాఖ – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ఉన్న భీమిలి అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లా భీమిలి నియోజకవర్గం అభివృద్ధికి అపార అవకాశాలున్న ప్రాంతమని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వలసలు వచ్చిన వారు కూడా భీమిలి నియోజకవర్గంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న కారణంగానే రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు నమోదయ్యారని పేర్కొన్నారు. టిడిపి – జనసేన  -బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో రాష్ట్రానికి సంబంధించినదని, స్థానికంగా పరిష్కరించగలిగే సమస్యలను లోకల్ మేనిఫెస్టోలో పొందుపరుస్తానని చెప్పారు. పంచ గ్రామాల భూ సమస్య, ఇనాం భూ సమస్య, చిట్టివలస జూట్ మిల్లు కార్మికుల సమస్య వంటి అనేక అపరిష్కృత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వివరించారు.

*భీమిలి లో 3,800 కోట్ల అభివృద్ధి పనులు*

మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, అధికారులతో బస్సులో భీమిలి నియోజకవర్గం అంతా పర్యటించి ఇక్కడి అభివృద్ధి అవకాశాలను వివరించానని తెలిపారు. దానికి సంతృప్తి చెందిన చంద్రబాబు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.3,800 కోట్లు కేటాయించారన్నారు.

 

*భారీ మెజారిటీ ఖాయం*

ఎన్నికల ప్రచారంలో జన స్పందన చూస్తుంటే 2014 ఎన్నికల్లో వచ్చిన 37,500 ఓట్ల మెజారిటీని మించిన మెజారిటీ రాబోతుందని అర్థమవుతోందని గంటా చెప్పారు. ఏ గ్రామానికి వెళ్లినా  ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు కాకుండా విజయోత్సవ సభకు వెళ్లినట్టుగా ప్రజలు పూలవర్షంతో తడిపి ముద్ద చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి సందీప్ కు 25 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని, అవన్నీ ఈసారి అఖండ మెజారిటీ రావడానికి దోహదం చేస్తాయన్నారు. మోడీ నాయకత్వం – చంద్రబాబు విజన్ – పవన్ కల్యాణ్ చరిష్మా సహా స్థానికంగా తనపై ఉన్న అభిమానం, వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత కారణంగా రాష్ట్రం చర్చించుకునే స్థాయి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

*వ్యక్తిగత విమర్శలకు దూరం*

వ్యక్తిగత విమర్శలకు తాను ఎప్పుడూ దూరమని వ్యక్తుల గురించి మాట్లాడి తన స్థాయి తగ్గించుకోనని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.  అవతలి వ్యక్తులు తన గురించి వంద మాట్లాడినా స్పందించనని, కేవలం అభివృద్ధి గురించి, పార్టీ పాలసీల గురించి మాత్రమే మాట్లాడి ఓట్లు అడుగుతానని తెలిపారు.