May 18, 2024

People News Channel

Best News Web Channel

హామీల అమలులో జగన్ మడత పేచీలు – మద్య నిషేధం చేయకుండా మడమ తిప్పాడు – మా ప్రభుత్వం రాగానే ప్రజా మ్యానిఫెస్టో అమలు చేస్తాం – భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఫైర్

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):  జగన్మోహన్ రెడ్డి హామీలు మోసాలమయమని, మడత పేచీలతో పేద ప్రజలను నిలువునా దగా చేశారని రాష్ట్ర ప్రజలంతా తెలుసుకున్నారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.  ఆనందపురం మండలం గిడిజాల దిబ్బడిపాలెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుటుంబంలో పిల్లలందరికీ అమ్మ ఒడి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్, పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కత్తే కదా అని నాలిక మడత వేశారన్నారు. 2 వేల పెన్షన్ 3 వేలు చేస్తామని చెప్పి, ఏడాదికి 250 రూపాయలు వంతున మాత్రమే పెంచి ఒక్కో పెన్షనర్ కు ఈ అయిదేళ్లలో 27 వేల రూపాయలు ఎగ్గొట్టారని విమర్శించారు. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పి, నాసి రకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఓటమి భయంతో ఉన్న వైసీపీ, టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4 వేల పెన్షన్, మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, పిల్లలందరికీ అమ్మ ఒడి వర్తింపు వంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టిడిపి సమయంలో చేసిన అభివృద్ధి ప్రతి గ్రామంలో కనిపిస్తుండగా, వైసీపీ హయంలో కేవలం శిలా ఫలకాలు వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు.కూటమి ఏర్పాటులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చూపించిన తెగువ, త్యాగం రాష్ట్ర ప్రజలు మరచిపోరని గంటా ప్రశంసించారు. జగన్ గెలిస్తే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని, తమ పార్టీ సీట్లను సైతం త్యాగం చేశారన్నారు. విశాఖ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ 3 లక్షల కోట్ల ఆడాయమున్న ఆంధ్రప్రదేశ్ ఏటా లక్ష కోట్ల వడ్డీని, 50 వేల కోట్ల అసలును చెల్లించాల్సి వస్తుందని వివరించారు.ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన జనం గంటాకు, శ్రీభరత్ కు ఘన స్వాగతం పలికారు. భీమిలి టిడిపి ఇంచార్జీ కోరాడ రాజబాబు, జనసేన ఇంచార్జీ పంచకర్ల సందీప్, బీజేపీ ఇంచార్జీ రామునాయుడు, బోస్ తదితరులు పాల్గొన్నారు.