May 18, 2024

People News Channel

Best News Web Channel

జగన్ మోసపు రెడ్డి – పరిశ్రమలను తరిమేస్తుంటే ఉద్యోగాలెలా వస్తాయి!? -భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు

(పీపుల్ న్యూస్ – భీమిలి):ప్రజలను వంచించిన జగన్ మోహన్ రెడ్డిని జగన్ మోసపు రెడ్డిగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. అయిదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమను తీసుకురాలేని ముఖ్యమంత్రి, పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీలను సైతం తరిమేశారని ఆయన విమర్శించారు.

ప్రచారంలో భాగంగా భీమిలి పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ తిరుపతి రేణిగుంటలోని అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమపై 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని, మరో 15 వేల మందికి ఉపాధి కలిగించే ప్లాంటు విస్తరణకు అనుమతిని ఇవ్వకపోవడం వల్ల ఆ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే లులు షాపింగ్ మాల్ ను విశాఖ నుంచి తరిమేశారని, వైసీపీ అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేయబోమని హైదరాబాద్ కు లులు షాపింగ్ మాల్ తరలిపోయిందని తెలిపారు. టిడిపి హయాంలో అనంతపురంలో స్థాపించిన కియా పరిశ్రమ వల్ల వేలాది మందికి ఉపాధి కలుగుతోందని గుర్తు చేశాడు. విద్యావంతులైన యువత ఉద్యోగాలు లేక రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేశారని, అధికారం ఆఖరుకు వచ్చేసిందని తెలిసే మెగా డీఎస్సీ పేరుతో 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దగా చేశారని చెప్పారు. జగన్ లాగా అప్పులు తెచ్చి బటన్ నొక్కడం ఇంట్లో ఉన్న ముసలమ్మ కూడా చేస్తుందని, ముఖ్యమంత్రి అంటే ప్రజల అవసరాలు గుర్తుంచుకుని పాలన సాగించాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం తెలుసునని, మేనిఫెస్టో లో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. ప్రచారంలో టిడిపి ఇంచార్జీ కోరాడ రాజబాబు, జనసేన ఇంచార్జీ పంచకర్ల సందీప్, బీజేపీ ఇంచార్జీ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.