May 18, 2024

People News Channel

Best News Web Channel

ఓట్లు అడిగే నైతిక హక్కు జగన్ కు లేదు – ప్రజా సమస్యలు పట్టనివాడు నాయకుడే కాదు – భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని సాలిగ్రామపురం సత్యసాయినగర్ వద్ద బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల అమలులో పేచీలు, మెలికలు పెట్టి పేదల ఉసురుపోసుకున్న జగన్ కు ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఇంట్లో పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇస్తానని మాట తప్పారని, అలాగే 2 వేల పెన్షన్ 3 వేలు చేస్తానని చెప్పి, ఏడాదికి 250 వంతున పెంచి అయిదేళ్లలో అవ్వా తాతలకు 27,500 నష్టాన్ని కలిగించారని విమర్శించారు. ఇలా అన్ని పథకాల్లోనూ ఏదో ఒక మెలిక పెట్టి ప్రజలను వంచించారన్నారు. చంద్రబాబు హయాంలో పెద్దఎత్తున పరిశ్రమలు తరలి రాగా,  జగన్ పాలనలో ఉన్న పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోతున్నాయని ఆరోపించారు. మద్య నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓటు అడగబోనని ప్రగల్భాలు పలికిన జగన్ ఆ హామీని అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి జనం మధ్యలోకి వచ్చాడని పేర్కొన్నారు. అయిదేళ్ల పరిపాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా రాష్ట్రాన్ని అగ్రస్థానం నుంచి అధమ స్థాయికి దిగజార్చారని తెలిపారు. ప్రజా సమస్యలు పట్టని వ్యక్తికి నాయకుడిగా ఉండే అర్హత లేదని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని చంద్రబాబు సమర్థంగా అమలు చేయగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 3 వేల పెన్షన్ 4 వేలుకు పెంచుతామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన మహిళలకి 1500 భృతి, 3000 నిరుద్యోగ భృతి తదితర అనేక పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని వివరించారు. 2014- 19 మధ్యలో భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.3,,800 కోట్లతో అభివృద్ధి పనులతో రాష్ట్రంలో నెంబర్ వన్ గా చేశామన్నారు.

*సింహాచలం దేవస్థానం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం*

అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సింహాచలం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ప్రకటించారు. 2014-:2019 కాలంలో తాను ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు సింహాచలం దేవస్థానం ఈవో తోనూ, పోర్టు చైర్మన్ తోనూ చర్చించి కాలనీ వాసులు సమస్యలు పరిష్కరించామని వెల్లడించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల రిపేర్లు చేసుకోవడానికి, అదనపు అంతస్తులు నిర్మాణం చేసుకునే సౌలభ్యం కల్పించమని గంటా శ్రీనివాసరావు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కుంటామని హామీ ఇచ్చారు. 45 వార్డు పరిధిలోని బిలాల్ కాలనీ, గణేష్ నగర్ తదితర  ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.  కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్  పైలా ముత్యాలనాయుడు, రాజు, త్రినాథ్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.