May 18, 2024

People News Channel

Best News Web Channel

అనుభవమున్న నాయకుడికి మద్దతు పలకండి – ఆంధ్రను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడదాం – భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు

(పీఫుల్ న్యూస్ – విశాఖపట్నం):   అనుభవమున్న నాయకుడికి మద్దతు పలికి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కోరారు. అనుభవరాహిత్యంతో రాష్ట్రాభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. జి.వి.ఎం.సి. 3వ వార్డు పరిధిలోని నూకాలమ్మ గుడి, గంటస్థంభం సెంటర్, గుప్తా వీధి, వీరాంజనేయ స్వామి గుడి, ఎగువపేట, నేరళ్లవలస కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గొల్ల వీధులలో గురువారం ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. జగన్ పాలనలో అధమస్థాయికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ కుదురుకోవాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు నాయకత్వం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో పటిష్ఠమైన కూటమి ఏర్పాటు కావడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవే ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారం కాకూడదనే ఆలోచనతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీల మధ్య పొత్తు కుదిర్చారని తెలిపారు. ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజాగ్రహం తీవ్రంగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడం వల్ల కూటమి అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీలు వస్తాయన్నారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 డీఎస్సీ లు విజయవంతంగా నిర్వహించానని గంటా తెలిపారు. ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు 6 వేల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి దానికి మెగా డీఎస్సీ పేరు పెట్టి నిరుద్యోగులను దగా చేశారని ఆయన విమర్శించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మోసం చేశారన్నారు. కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ఉన్నవి తరలిపోయేట్టు చేస్తోందని, చదువుకున్న యువతకు ఇంకా ఉద్యోగావకాశాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేయని జగన్మోహన్ రెడ్డి 99 శాతం హామీలు నెరవేర్చానని ఎలా చెబుతారని నిలదీశారు. నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
టిడిపి అధికారంలోకి వస్తే పేదల పథకాలు ఆపేస్తారని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ టిడిపి అని, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. వైసీపీ కంటే మెరుగైన పథకాలను తీసుకురానున్నామని ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావించారు. 3 వేల పెన్షన్ 4 వేలకు పెంపు, 3 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3;గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఏడాదికి 20 వేలు, 18 ఏళ్ల వయస్సు దాటిన మహిళలకు 1500 భృతి వంటి అనేక పథకాలు మేనిఫెస్టోలో పొందుపరిచామని వెల్లడించారు.