May 18, 2024

People News Channel

Best News Web Channel

సీఎంగా జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం – రాష్ట్రంలో 160, ఉత్తరాంధ్రలో 30కి పైగా సీట్లు గెలుచుకుంటాం – అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిపై దాడి చేసి విష సంస్కృతికి తెర తీశారు – గంటా శ్రీనివాసరావు

(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం);  రాష్ట్రమంతా 160 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి కూటమి చరిత్ర సృష్టించబోతోందని, జూన్ 9న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ మంత్రి, భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎం.వి.పి. కాలనీలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమికి రోజురోజుకు జనం మద్దతు అనూహ్యంగా పెరుగుతోందని, రాయలసీమలోని వైసీపీ కంచుకోటలు సైతం బద్దలు కానున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో కూటమి 30కి పైగా స్థానాలు గెలవబోతోందని పేర్కొన్నారు. కూటమి ప్రజాగళం మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి విశేషమైన స్పందన కనిపిస్తోందని తెలిపారు. సంక్షేమమే ఊపిరని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోను పాత పథకాలకే పరిమితం చేశారని, 3 వేల పెన్షన్ ను 2029 ఎన్నికల సమయానికి 3,500 చేస్తాననడం పేద ప్రజలను మభ్య పెట్టడమేనని చెప్పారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఇస్తున్న రూ.200 పెన్షన్ ను 10 రెట్లకు రూ.2000కు పెంచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఆ రూ. 2000 పెన్షన్ ను రూ.3000 కు చేయడానికి వైసీపీకి అయిదేళ్లు పట్టడం హాస్యాస్పదమని అన్నారు. కూటమి మేనిఫెస్టో హామీలను అమలుకు ఇప్పుడు తమ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న 70 వేల కోట్లకు మించిన నిధులు ఎలా తెస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డిలా అప్పులు చేసి బటన్ నొక్కడం కాకుండా సంపద సృష్టించి సంక్షేమాన్ని అందించడం చంద్రబాబుకు తెలుసునన్నారు. జగన్మోహన్ రెడ్డి నిక్కర్లు వేసుకున్నప్పుడే అన్న ఎన్టీఆర్ 2 రూపాయలకు కిలో బియ్యం, హౌసింగ్, పెన్షన్ వంటి పథకాలతో ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేశారని గంటా చెప్పారు. లులు మాల్, అమరరాజా వంటి ఉపాధి అవకాశిలిచ్చే పరిశ్రమలను పక్క రాష్ట్రాలకి తరలిపోవడం వల్ల యువతకు ఉద్యోగావకాశాలు సహా రాష్ట్ర ఆదాయం కూడా తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరాశ, నిస్పృహల్లో జగన్:

ఈ ఎన్నికల్లో ఘోరమైన పరాభవం ఖాయమనే నిస్పృహతో జగన్మోహన్ రెడ్డి గులకరాయి సంఘటనలా తనపై తాను దాడి చేయించుకోవడం లేదా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారని జగన్ పై ధ్వజమెత్తారు.  దాడికి గురైన బీజేపీ కార్యకర్త ను పరామర్శించడానికి వెళ్లిన అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ పై బాధ్యతాయుతమైన డిప్యూటి సిఎం పదవిలో ఉన్న బూడి ముత్యాలనాయుడు దాడిని తీవ్రంగా ఖండించారు. పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం సామాన్యుల హక్కులను హరించడమే:

జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం సామాన్య ప్రజానీకం హక్కులను హరించడమేనని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ చట్టంతో స్థిరాస్తి పత్రాలు జగన్ తీసేసుకుంటారని వృద్ధులు, రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక తలా తోక లేని ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడంపై కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. బీజేపీ భీమిలి ఇంచార్జీ రామునాయుడు మాట్లాడుతూ భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ రాబోతోందని చెప్పారు. జనసేన నాయకుడు ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి హయాంలో రాష్ట్ర అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి భీమిలి ఇంచార్జీ కోరాడ రాజబాబు పాల్గొన్నారు.